
భగవద్గీత రెండవ అధ్యాయంలోనే శ్రీకృష్ణుడు "కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన" అని చెప్పి కర్మయోగానికి బలమైన భూమిక ఏర్పరచాడు. అతని ఉద్దేశ్యం – నీ దృష్టి పని మీద ఉండాలి కాని ఫలితాల మీద కాదని చెప్పడం. ఎందుకంటే ఫలితం మన చేతుల్లో ఉండదు. అది కాలం, సమయం, సంయోగం, పూర్వజన్మ వాసనల వంటి అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది. కర్మయోగి మాత్రం పని చేయడం తన ధర్మంగా భావించి, అది ఎంత చిన్న పని అయినా భగవంతుడి పూజగా భావిస్తూ చేస్తాడు.
కర్మయోగం యొక్క ప్రధాన లక్షణాలు:
నిష్కామ కర్మ : “ఏదైనా పనిని ఫలాపేక్ష లేకుండా చేయడం”. ఆ ప్రవర్తన మనిషిలోని అసూయ, గొప్పతన భావన, స్వార్థం వంటి చెడు ఆలోచనలను తొలగిస్తుంది.
సమత్వబుద్ధి : యోగస్థ కురు కర్మాణి అని గీతలో చెప్తాడు కృష్ణుడు. విజయ-పరాజయాలు, లాభ-నష్టాలు, ప్రశంస-నిందలు అనే ద్వంద్వ సంబంధాల్లో సమంగా ఉండడం.
అర్పణబుద్ధి : ప్రతి పనినీ భగవంతునికి సమర్పించడంవల్ల అది పవిత్రంగా మారుతుంది. అప్పుడు కర్మ ద్వారా బంధం కలగదు.
అహంకార రాహిత్యం : “నేనే చేసాను” అనే భావన లేకుండాచేయడం. అది ఆత్మానుభూతికి దారితీస్తుంది.
కర్మయోగాన్ని అనుసరించే వ్యక్తి రోజువారీ జీవితం, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, సేవా కార్యక్రమాలు, అన్ని చేస్తూనే ఆధ్యాత్మికంగా కూడా ఎదగవచ్చు. ఇలా జీవితం చివరి వరకూ “ పని చేస్తూ మనసుతో భగవంతుడి వైపుగా” ఉండడమే కర్మయోగం అందించే అసలైన సారము.
కర్మయోగం వల్ల కలిగే ప్రయోజనాలు:
అహంకార విముక్తి : 'నేను' అనే భావన తగ్గి, ‘భగవంతుడు చేయిస్తున్నాడు’ అనే దివ్యభావన ఏర్పడుతుంది.
మానసిక శాంతి : ఫలితాలపై ఆశక్తి లేకపోవడంతో టెన్షన్, భయాలు తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది.
సమాజహిత బావన: బహుళజన హితాయే, బహుళజన సుఖాయే అనే దృక్పథం వచ్చి సేవామార్గంలో ముందుకు పోతాడు.
ఆత్మశుద్ధి : పనిని పూజగా భావించి చేస్తే మనసు స్వచ్ఛం అవుతుంది, తద్వారా నిజమైన సాధనకు మార్గం ఏర్పడుతుంది.
ఆధ్యాత్మిక ఉద్ధరణ : కర్మయోగి యోగస్థుడై క్రమంగా కర్మబంధం నుండి విముక్తి పొందుతూ మోక్షమార్గంలో అడుగులు వేస్తాడు.
కర్మయోగం అనేది బాహ్య కార్యాచరణ మాత్రమే కాదు. అది ఒక ఆంతరిక దృష్టికోణం. ఒకే పని, ఒకే ఫలితంతో రెండు రకాలుగా చేయచ్చు – ఒకటి బంధానికి దారి తీస్తే, మరొకటి విముక్తికి కారణం అవుతుంది. ఉదాహరణకు గృహిణి వంట చేయడం. ఒక గృహిణి మర్యాదపూర్వకంగా, ఆసక్తిగా, ప్రతి వంటను భగవంతుని ప్రత్యక్ష సేవగా భావించి చేస్తే అది కర్మయోగం. అదే పనిని నిర్లక్ష్యంగా, ఏదో అవసరం కోసం ఉంటే నెరవేర్చితే అది సాధారణ డ్యూటీ మాత్రమే. ఈ రెండు మధ్య తేడా మనసులోని భావనలే.
కర్మయోగ సూత్రాల్ని ప్రతి వృత్తిలోనూ, వయస్సులోనూ అనుసరించవచ్చు – ఉద్యోగి ఉద్యోగంలో, రైతు వ్యవసాయంలో, వ్యాపారి వ్యాపారంలో, విద్యార్థి చదువులో, శ్రీ రామ సేవ సమితి సభ్యులు భక్తులను పెంచడంలోనూ... ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాన్ని వైవిధ్యంగా పాటిస్తూ, పనులను భగవంతునికి అర్పిస్తూ, ఫలాపేక్ష లేకుండా చేస్తే అదే కర్మయోగ మార్గం అవుతుంది.
గీతలో శ్రీకృష్ణుడు చివరికి చెబుతాడు – మనుషులు పని చేయకుండా ఉండలేరు. శరీరం ఉన్నాళ్ళు ఏదో ఒక పని చేయవలసిందే. అయితే అసలు ప్రశ్న – ఆ పని బంధానికి దారి తీస్తుందా లేక విముక్తికి దారి తీస్తుందా? కర్మయోగం బంధం నుండి విముక్తికి దారి చూపే మార్గం. అందుకే “యోగః కర్మసు కౌశలం” అని అంటాడు – పనిని శ్రద్ధతో, చేయడమే యోగం.
ముగింపు
సంక్షిప్తంగా చెప్పాలంటే, కర్మయోగం అనేది భగవద్గీత బోధించిన విద్యా. ఇది “పని చేయవలసిందే, కాని ఫలితాన్ని జోడించుకోవద్దు” అనే జీవనవిధానం. ఇదే మన జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో, ప్రశాంతంగా, సేవామయంగా మార్చే అసలైన మార్గం. ఈ దృక్పథంతో పనులను నిర్వర్తించే వాడే నిజమైన కర్మయోగి.
0 కామెంట్‌లు